జగన్ సర్కార్ లోని పలువురు ఐఏఎస్ లు, అధికారుల తీరుపై హైకోర్టు గతంలో చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హైకోర్టు గతంలోనే పలుమార్లు హెచ్చరించింది. ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక..చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినక..మధ్యలో ఐఏఎస్, సీఎస్ లు నలిగిపోతున్నారు. దీంతో, కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ప్రభుత్వం, అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో గతంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించింది.
హైకోర్టు తీర్పును అమలు చేయలేదని, అది కోర్టు ధిక్కరణే అని ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు హైకోర్టు గతంలో వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఇద్దరు ఐఏఎస్ లు అమలు చేయకపోవడంతో వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయినా సరే ఏపీలో కొందరు ఐఏఎస్ ల తీరు మారలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎస్ కు హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని పలు పాఠశాలల ఆవరణల్లో నిర్మిస్తోన్న సచివాలయ భవనాల వ్యవహారంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది. స్కూలు ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దంటూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
అయినా సరే, వాటి నిర్మాణాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దీంతో, కొందరు పిటిషనర్లు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టారని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…హైకోర్టు ఆదేశించినా భవనాలు నిర్మించడంపై వివరణ ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది. దీంతో, ఏరికోరి జగన్ సీఎస్ గా నియమించిన జవహర్ రెడ్డి చార్జ్ తీసుకున్న రెండు వారాలకే కోర్టు మెట్లెక్కాల్సి వచ్చినట్లయింది.