ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా…ఏ సీఎం చేయని విధంగా ఏపీలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆ పథకాల అమలు కోసం జగన్ అప్పులు చేస్తున్నా….జనాలకు తిప్పలు తప్పకున్నా సరే…తమ పాలన భేష్ అంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక, కొందరికి ఆ సంక్షేమ, ఉచిత పథకాల అందించడం కోసం అందరిపై జగన్ ‘పన్ను’పోటు పొడుస్తున్నారని వస్తోన్న విమర్శలను వైసీపీ నేతలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు.
ఇక, ఆ పథకాల అమలు కోసం అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ప్రభుత్వం వేరే శాఖల నిధులను దారి మళ్లించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం దేవాదాయ శాఖకు చెందిన రూ.49 లక్షల నిధులను మంజూరు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై తిరుపతి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు…సంచలన ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాహన మిత్ర పథకానికి దేవాదాయశాఖ నిధులు ఖర్చు చేయవద్దని జూలై 5 వరకు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 5కి హైకోర్టు వాయిదా వేసింది.
అంతకుముందు, రాజకీయ లబ్ది కోసమే దేవాదాయశాఖ నిధులను ఆ పథకానికి ఖర్చు చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దేవాదాయశాఖ చెందిన 49 లక్షల రూపాయలను వాహన మిత్ర పథకానికి కు మంజూరు చేయడం చట్టవిరుద్దమని కోర్టుకు విన్నవించారు.