సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ కు కోర్టు నుంచి అక్షింతలు తప్పడం లేదన్న వాదనలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలు..వెరసి ఏపీ ప్రభుత్వం పలుమార్లు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అలా జగన్ సర్కార్ హైకోర్టుకో, సుప్రీం కోర్టుకో వెళ్లిన చాలాసార్లు చుక్కెదురవుతూనే ఉండడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యవహారంలో జగన్ సర్కార్కు హైకోర్టు ముచ్చటేసే ఓ ప్రశ్న సంధించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేసేలా తెచ్చిన జీవో నం. 107ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా స్కూళ్ల విలీనంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ సంధించిన ప్రశ్నలు ప్రతి ఏపీ పౌరుడు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇంటికే రేషన్ అందిస్తున్న జగన్ సర్కార్…పాఠశాలల విలీనం పేరుతో 3,4,5 తరగతి పిల్లలను మూడు కిలోమీటర్ల దూరం నడిపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంటి వద్దకే రేషన్ కావాలని ఏ ఒక్కరూ కోరుకోలేదని, నెలలో ఏదో ఒకరోజు రేషన్ షాపుకెళ్లి రేషన్ తెచ్చుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు లేరని నెటిజన్లు అంటున్నారు. అన్నారు. కొత్త విధానం వల్ల ఆ రేషన్ డెలివరీ వాహనం కోసం పనులు మానుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి ఉంది. ఇక, ఇంటికి సమీపంలోనే ఉన్న స్కూళ్లను మూసివేయడంపై ప్రజలతోపాటు 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతులు సమర్పించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
జస్టిస్ బట్టు దేవానంద్ కామెంట్స్, ఎమ్మెల్యేల ఆవేదన నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అర్థమవుతోంది. మరి, ఆ నిర్ణయాన్ని జగనన్న వెనక్కు తీసుకుంటారా…లేక మాట తప్పను మడమ తిప్పను అంటూ విలీనం కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.