టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం వ్యవహారంలో జగన్ సర్కార్ పై ముందు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అనుయాయులకు, అనుకూల వర్గానికి పే…..ద్ద పీట వేశారని, తనతో జైలు జీవితం గడిపిన జైలు పక్షులు, బడా బడా వ్యాపారవేత్తలను సభ్యులుగా నియమించుకున్నారని విపక్ష నేతలు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
దీంతో, టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అంతేకాదు, ఈ నియామకాలపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
టీటీడీ పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ హైకోర్టులో బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై నేడు వాదనలు జరిగిన సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేర చరిత్ర ఉన్న వారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తక్షణమే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నోటీసులపై 3 వారాల్లోగా సమాధానమివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా జగన్ హిందూదేవాలయాల పవిత్రతను దెబ్బతీయకుండా, అర్హులైన వారిని, ఆధ్యాత్మిక చింతన, అపారమైన భక్తిభావం ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయలని జగన్ కుట్ర చేస్తున్నారని, రాజకీయ అవసరాల కోసం టీటీడీలో అనర్హులను జగన్ చొప్పిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.