నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాల ఫైల్ దొంగతనం ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాకాణిపై టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీ చేశారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత నెల్లూరు ఎస్పీ విజయరావు చెప్పిన వివరాలు వైరల్ అయ్యాయి. ఆ ఫైలు దొంగిలించింది ఇద్దరు పాత నేరస్తులని, కోర్టులో ఇనుము దొంగతనం చేయడానికి వెళ్లి కుక్కలు అరవడంతో కోర్టులోపలికెళ్లి ఓ బ్లూ కలర్ బ్యాగ్ కొట్టేశారని చెప్పారు.
అయితే, కోర్టులో ఎన్నో ఫైల్స్ ఉండగా కాకాణికి సంబంధించిన ఫైలు మాత్రమే ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఆ చోరీతో తనకెలాంటి సంబంధం లేదని, ఆ కేసులో హైకోర్టు విచారణకూ లేదా సీబీఐ విచారణకు సిద్ధమని కాకాణి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర పోలీసులు ఈ కేసులో సరి అయిన దిశలో దర్యాప్తు చేయడం లేదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నివేదికను పిల్ గా పరిగణించిన ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ గతంలో అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే అప్పట్లో సిబిఐ డైరెక్టర్, ఏపీ డీజీపీ, మంత్రి కాకాణికి ఏపీ హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ కేసును సిపిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.