ఏపీలో ప్రభుత్వమే ఆన్ లైన్లో సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించిన వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని నిర్ణయించిన జగన్ సర్కార్ జీవో 69ని ఈ నెల 2న జారీ చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని థియేటర్ల యజమానులను ఆదేశించింది.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాకయ్యారు. అంతేకాదు, ఎంవోయూపై జులై 2లోగా సంతకాలు పెట్టాలంటూ డెడ్ లైన్ జారీ చేయడంతో అవాక్కయ్యారు. టికెట్లు అమ్మిన తర్వాత థియేటర్ల యజమానులకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయంపై ఎంఓయూలో స్పష్టత లేదని ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. అవసరమైతే థియేటర్లు మూసివేసేందుకు కూడా రెడీ అని యజమానులు అంటున్నారు.
అయితే, అంతకుముందే ఈ చట్టం వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వారి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు…తాజాగా జగన్ కు షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రకారం శుక్రవారం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.