టీటీడీ నూతన పాలకమండలిలో నేర చరితులు, లిక్కర్ స్కాం లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ అనుయాయులను మెప్పించడం కోసమే సీఎం జగన్ వారికి టిటిడి పాలక మండలిలో సభ్యత్వం కల్పించారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగన్ పాలనలో హిందూ మతంపై ఎన్నోరకాలుగా దాడులు జరుగుతున్నాయని విపక్ష నేతలు మండిపడుతున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత టీటీడీ ప్రతిష్ట మసకబారిందని హిందు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే నేర చరితులకు పాలకమండలిలో సభ్యత్వం కల్పించడంపై ఏపీ హైకోర్టులో విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా జగన్ సర్కార్ కు, టీటీడీకి షాక్ ఇచ్చింది. టీటీడీ పాలక మండలిలో నేర చరిత ఉన్నవారు సభ్యులుగా ఉండడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రా రెడ్డి, డాక్టర్ కేతన్, వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుల నియామకం చెల్లదని పిల్ లో పేర్కొన్నారు.
వారు సభ్యులుగా ఉండటం భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉందని అన్నారు. తాత్కాలికంగా బెయిల్ పై ఉన్న నిందితుడిని టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఎన్నుకోవడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ పిల్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులైన దేవాదాయ శాఖ కమిషనర్, టిటిడి ఈవో లను వివరణ కోరింది. ఈ కేసులో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.