ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల భూ దందాలు, భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం బట్టబయలైంది. ఇక, తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారంపై హైకోర్టు కూడా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే నేడు కోర్టు ఆదేశాల ప్రకారం సజ్జల ఎస్టేట్ లో భూమి రీ సర్వేను అధికారులు చేపట్టారు.
వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో అధికారులు భూమి రీ సర్వే చేపట్టారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ భూమిని ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాల అటవీ భూమి ఉందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, రీసర్వే చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో మూడు శాఖల అధికారులు సజ్జల ఎస్టేట్లో నేడు కొలతలు వేస్తున్నారు.
సజ్జల కుటుంబ సభ్యులకు ఆ ఎస్టేట్ లో మొత్తం 146 ఎకరాల భూమి ఉండగా…అందులో 55 ఎకరాలు అటవీ భూమి అని రెవెన్యూ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ భూమి తమది కాదని అటవీశాఖ చెబుతోంది. దీంతో, సమగ్ర సర్వే చేసి హద్దులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ, అటవీ శాఖ, సర్వేయర్లు సంయుక్తంగా సర్వే చేపట్టేందుకు రంగంలోకి దిగారు. అయితే, ఈ సర్వే ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాను సజ్జల కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు.