అధికారం మనదే కదా అని అనుకున్నదల్లా చేసేద్దామన్న ధోరణి సీఎం జగన్ లో కనిపిస్తుందన్న వాదన చాలాకాలంగా ఉంది. ప్రభుత్వం చేసే పనులు హుందాగా ఉండాలని, కోర్టులో, మరొకరో మొట్టికాయలు వేసేవరకు తెచ్చుకోకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా…వైసీపీ సర్కార్ తీరు మాత్రం మారడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీీఎం జగన్ కు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తిరుపతిలోని పద్మావతి నిలయాన్ని తాత్కాలిక కలెక్టరేట్‌గా మార్చడానికి వీల్లేదంటూ హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతిలోని పద్మావతి నిలయాన్ని తాత్కాలిక కలెక్టరేట్‌గా మార్చాలని జగన్ గట్టిగా ఫిక్సయ్యారు. అయితే, భక్తుల చందాలు, విరాళాలతో ఏర్పాటు చేసిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించడంపై విపక్షాలతో పాటు సామాన్యులు, శ్రీవారి భక్తులు విమర్శలు గుప్పించారు.
దీంతో, ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీకి చెందిన పద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పద్మావతి నిలయంపై యథాతథ స్థితిని పాటించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ పిటిషన్ల విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
వాస్తవానికి పద్మావతి నిలయంలో కేవలం కలెక్టరేట్ మాత్రమే ఏర్పాటు చేయాలని ముందు నిర్ణయించారు. అయితే, అక్కడ 200 వరకు విశాలమైన గదులుండడంతో జిల్లా స్థాయి కార్యాలయాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే పాలనా సౌలభ్యం ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు భావించారు. అందుకు తగ్గట్లుగా గదుల విభజన, మౌలిక వసతులు వంటి పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే హైకోర్టు తాజా తీర్పుతో వాటికి బ్రేక్ పడ్డట్లయింది.