టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నకు, ఆయన తనయుడు చింతకాయల రాజేష్ కు విశాఖ మెట్రోపాలిటన్ కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ ఏపీసిఐడి పోలీసులు గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా హడావిడిగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ దూకి మరీ లోపల వైపు వేసిన తలుపులు పగలగొట్టి అయ్యన్న, రాజేష్ లను అరెస్ట్ చేసిన వైనం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే అయ్యన్న, రాజేష్ లను రిమాండ్ కు అప్పగించాలని కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు.
అయ్యన్న, రాజేష్ లపై నమోదైన కేసులో సెక్షన్ 467 వారికి వర్తించదని మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సిఐడి….హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ఏపీసిఐడి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అదే సమయంలో తమపై సిఐడి అధికారులు దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ అయ్యన్నపాత్రుడు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రెండు పిటిషన్ల తదుపరి విచారణను ఈనెల 10కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయ్యన్న, రాజేష్ లపై నమోదైన కేసులో సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారు అంటూ విశాఖ మెట్రోపాలిటన్ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో అయ్యన్న, రాజేష్ లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న జరగబోయే తదుపరి విచారణ నాటికి ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని వారికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలతో అయ్యన్నపాత్రుడుకు షాక్ తగిలినట్లయింది.