ఏపీ సీఎం జగన్ కు ఓ కేసులో సమన్లు జారీ చేయకపోవడంపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా హుజూర్నగర్లో జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభియోగంపై సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించినా…అధికారులు జారీ చేయలేదు. దీంతో, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు…ఈ నెల 31లోగా జగన్కు సమన్లు అందజేయాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఆ కేసు విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. అయితే, మొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడతో ఆ విచారణకు జగన్ హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును సీఎం జగన్ ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు….జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు స్టే విధించింది. దీంతో, ఈ కేసులో జగన్ కు ఊరట లభించినట్లయింది. మరోవైపు, మార్చి 31న ఈ కేసు విచారణ జరగనుంది. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో…మార్చి 31న నాగిరెడ్డి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మూడో నిందితుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించింది.