సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీని, ఓ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారని, అందుకే అమరావతిపై అక్కసు పెంచుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, జగన్, వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
అంతేకాదు, ఈ ఏడాది దసరా నుంచి జగన్ విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. అయితే, హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టులో కూడా మూడు రాజధానులు, అమరావతి రాజధాని రైతుల వ్యవహారం పెండింగ్ లో ఉందన్న సంగతిని వైసీపీ నేతలు
మరచిపోయారు.
ఈ క్రమంలోనే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జీవో కూడా జారీ అయింది. అయితే, ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. విశాఖలో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జగన్ కు షాకిచ్చింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు కోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది.