ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్యతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
అయితే, ఈ తీర్పును ఏపీ ఎస్ఈసీ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్లపై డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలకమైన తీర్పునిచ్చింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
కానీ, ఎన్నికల కౌంటింగ్ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఏప్రిల్ 8న ముందస్తు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. 4 వారాల కోడ్ నిబంధన లేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.