ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్ లో సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. చాలామంది అభ్యర్థులు తమ ఆస్తులు అరకొరగా చూపించి ఎన్నికల సంఘం కళ్లుగప్పి ఎన్నికల తంతు ముగించేస్తుంటారు. తమకు వందల కోట్ల రూపాయాల ఆస్తులున్నప్పటికీ…తమ పేరు మీద ఉన్న కొద్దోగొప్పో ఆస్తులు చూపించి..పబ్బం గడుపుకుంటుంటారు. ఇలా చేసిన అభ్యర్థులు గెలిచి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన సందర్భాలు కోకొల్లలు. అలా అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించి సరైన వివరాలు సమర్పించలేదని తెలిసినా…వారిపై కోర్టు కు వెళ్లి న్యాయపోరాటం చేసే ఓపిక వారిపై పోటీచేసే వారికి ఉండకపోవచ్చు.
కానీ, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకటరావు మాత్రం అందుకు మినహాయింపు. తనపై పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో తప్పుగా సమర్పించారని ఆయన న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన పోరాటం ఫలించడంతో తాజాగా ఆయనను కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ ప్రకారం
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు తప్పుగా చూపించిన కొత్తగూడెం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
వనమా తన ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదని గుర్తించిన కోర్టు ఆయనపై వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. దీంతో, ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జలగం వెంగళరావు కుమారుడు అయిన జలగం వెంకట్రావు ఈ తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తప్పుడు అఫిడవిట్ లు సమర్పించే ఎందరో రాజకీయ నాయకులకు చెంప పెట్టు అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.