బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో కేటీఆర్ ను ఈడీ కూడా విచారణకు పిలిచింది. అయితే, ఆ కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది.
ఆ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాంతోపాటు, కేటీఆర్ అరెస్ట్ పై ఇప్పటివరకు ఉన్న స్టేను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
కోర్టు తీర్పు ఉన్నందున కేటీఆర్ అభ్యర్థన ప్రకారం ఈడీ నేటి విచారణకు సడలింపునిచ్చింది. తాజా తీర్పుతో కేటీఆర్ విచారణకు ఈడీ రెడీ అవుతోంది. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ కు మరోసారి తాజాగా నోటీసులిచ్చేందుకు ఏసీబీ అధికారులు కూడా రెడీ అవుతున్నారు. నిన్న తన లాయర్ ను విచారణ గదిలోకి అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే, లాయర్ లేకుండానే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్ కు నిన్న ఏసీబీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.