టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు ఈ రోజు కూడా ఏపీ హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దానిని విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించడంతో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. దీంతో, ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టులో రెగ్యులర్ పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ జరగనుంది. పిటిషన్ పై వాదనలు దాదాపుగా ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశముంది.
అంతకుమందు, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏ పై ముకుల్ రోహత్గిని జస్టిస్ త్రివేది ధర్మాసనం మూడు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. 17 ఏ నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా?, 2018లో విచారణ మొదలుపెట్టినప్పుడు ఏమి కనిపెట్టారు? అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలుకాకుంటే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారణ జరపవచ్చా? మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? అని జస్టిస్ త్రివేది సంధించిన ప్రశ్నలలో వేటికీ రోహత్గి సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది.