ఏపీలో పంచాయతీ ఎన్నికలు హోరా హోరీగా సాగుతోన్న సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. టీడీపీ సహా విపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరించి ఏకగ్రీవాలు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బలవంతపు ఏకగ్రీవాలు,నామినేషన్ల విత్ డ్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్లు ఉపసంహరణపై ఫిర్యాదులుంటే….ఆ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు….కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవాలైన స్థానాల్లో ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే ఆ ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్న వ్యవహారంపై చర్చ జరుగుతోంది. బలవంతపు ఏకగ్రీవాలపై విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఓ దశంలో తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఎస్ఈసీ యోచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై పూర్తి స్పష్టత వచ్చింది. మరి, ఈ ఆదేశాలపై ఎస్ఈసీ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.