నరేగా బకాయిల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వంపై గతంలో హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని అసహనం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో బిల్లులు చెల్లించాలని గత ఏడాది జనవరి 8న కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది
ఈ నేపథ్యంలో తాజాగా ఆ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై హైకోర్టు మండిపడింది. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 2 వారాల్లోపు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, బిల్లులు చెల్లించిన తర్వాత వాటికి సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.
2 వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, పెండింగ్ మొత్తానికి వడ్డీ, 20 శాతం మినహాయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని వెల్లడించింది. నరేగా పనులకు కేంద్రం నిధులు చెల్లించాల్సిఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ, రాష్టానికి తాము బకాయిలేమని కేంద్రం అఫిడవిట్ సమర్పించిందని కోర్టు పేర్కొంది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చారని, కానీ, చెల్లించలేదని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.
గతంలో జరిగిన విచారణలో ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి కేంద్రం కేటాయించిన నిధుల్లో రూ.1991 కోట్లు రాష్ట్రం దగ్గర ఖర్చు కాకుండా మిగిలే ఉన్నాయని కోర్టు దృష్టికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ గుట్టురట్టయినట్లయింది. దీంతో, కేంద్రం నిధులిచ్చామని చెబుతోందని, రాష్ట్రం రాలేదంటోందని, ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటే సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వం చెప్పే లెక్కలు వినేందుకు తాము సిద్ధంగా లేమని, కోర్టు ఆదేశాలు అమలు చేశారా? లేదా? అనేదే ముఖ్యమని స్పష్టం చేసింది. తాము చర్యలకు ఉపక్రమించేందుకు సమయం ఆసన్నమైందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఆర్థిక శాఖాధికారులు కోర్టు ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని కూడా గతంలో కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.