జగన్ కు హైకోర్టు షాక్…ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ….జగన్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం…ఇటువంటి హెడ్డింగ్ లు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. హెడ్డింగులు మారినా…కాన్సెప్ట్ మాత్రం మారడం లేదు. జగన్ అనాలోచితంగా అపరిపక్వంగా నిర్ణయాలు తీసుకోవడం…వాటిపై ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించడం…చివరకు ఆ నిర్ణయాలను తప్పుబడుతూ కోర్టు తీర్పులు రావడం వంటి పరిణామాలు జగన్ రెండేళ్ల పాలనలో సర్వ సాధారణం అయిపోయాయంటే అతిశయోక్తి కాదు.
ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, న్యాయస్థానాలు చీవాట్లు పెడుతున్నా…జగన్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. ఆ తీరుకు తగ్గట్లుగానే న్యాయస్థానాల తీర్పులు మారడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.
జగనన్నవిద్యా దీవెన పథకం చెల్లింపుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ పథకం కింద తల్లుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
ఈ పథకం కింద తల్లులు ఖాతాలకు ప్రభుత్వం నగదు బదిలీ చేస్తోంది. అయితే, కాలేజీలకు వారు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు తల్లులు…తమ ఖాతాల్లో పడ్డ సొమ్మును ఇతరత్రా అవసరాలకు వాడుకుంటూ..కాలేజీ ఫీజులు చెల్లించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజులను కాలేజీ ప్రిన్సిపాల్ ఖాతాలో నేరుగా జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్ కోర్టును ఆశ్రయించారు.
కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున శ్రీ విజయ్….హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై, జగనన్న విద్యా దీవెన పథకం కింద వచ్చే నగదును నేరుగా ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నేరుగా కాలేజీల అకౌంట్లలో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంతో జగన్ కు హైకోర్టులో మరో షాక్ తగిలినట్లయింది.