జగన్ అక్రమాస్తుల కేసులో పలువురు ఐఏఎస్ లు నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ హయాంలో జగన్, వైఎస్ మాట కాదనలేకపోయిన ఐఏఎస్ లు కొందరు ఇపుడు కోర్టుల చుట్టు తిరగాల్సివస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి గతంలో సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనం రేపింది.
దాల్మియా కేసు విచారణకు రానందున శ్రీలక్ష్మీకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. ఆ వ్యవహారం అటుండగానే…తాజాగా రాజధాని కేసుల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులు వైదొలగాలని ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ నేడు జరిగిన సందర్భంగా శ్రీలక్ష్మిపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వింత వాదనలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మసకబార్చేలా, స్వతంత్రతను దెబ్బతీసేలా ఆధారాల్లేని ఆరోపణలు చేశారంటూ శ్రీలక్ష్మితోపాటు ప్రభుత్వ వైఖరిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కీలక కేసుల నుంచి న్యాయమూర్తులను తప్పించాలని ప్రైవేటు వ్యక్తులు డిమాండ్లు చేస్తుంటారని, కానీ ఇక్కడ ప్రభుత్వమే అనూహ్యంగా డిమాండ్ చేస్తోందని వ్యాఖ్యానించింది. ‘బెంచ్ హంటింగ్’ (తమకు గిట్టని న్యాయమూర్తుల వద్దకు పిటిషన్లు వెళ్లకుండా) వ్యూహంతో అవమానించడం, రెచ్చగొట్టే చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది.
కాగా, రాజధాని కేసుల విచారణ త్రిసభ్య ధర్మాసనంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.ఎ్‌స.ఎస్ సోమయాజులు ఉన్నారు. అయితే, ఆ ధర్మాసనం నుంచి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులను తొలగించాలని శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇద్దరు న్యాయమూర్తులు అమరావతి ప్రాంతంలో ప్లాట్లు కొన్నందున కేసు వారిని తప్పించాలని కోరారు. దీంతో, ఆ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు దానిని తాజాగా డిస్మిస్ చేసింది.