ఏపీ ప్రభుత్వానికి ఒకే రోజు రెండు షాకులిచ్చింది హైకోర్టు. కామన్ గుడ్ ఫండ్ సొమ్మును దేవాదాయ శాఖ కార్యాలయాలకు వినియోగించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీజీఎఫ్ నిధులతో ప్రభుత్వాన్ని నడపలేరని, ఈ రోజు నిర్మాణాలకు అనుమతిస్తే రేపు ఆఫీసుల్లో స్టేషనరీకి కూడా ఈ సొమ్మునే వినియోగిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సీజీఎఫ్ నిధులను కార్యాలయాల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారని ఓ విలేకరి హైకోర్టులో దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నిబంధనల ప్రకారమే నిధులు ఉపయోగించాలని, ఆ సొమ్మును ధూపదీప నైవేద్యానిలకు మాత్రమే వినియోగించాలని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దేవాదాయ శాఖ కార్యాలయాల నిర్మాణాలకు సీజీఎఫ్ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
మరోవైపు, విశాఖ మర్రిపాలెం భూవ్యవహారంలో కూడా జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలో తనకు చట్టబద్ధంగా ఉన్న భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రముఖ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి…ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.
దీంతో, సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగిస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ అప్పీల్ ను కొట్టి వేసింది. దీంతో, జగన్ సర్కార్ కు ఒకే రోజు రెండు షాక్ లు తగిలినట్లయింది.