టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం వ్యవహారంలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ తన అనుయాయులకు, అనుకూల వర్గానికి పెద్దపీట వేశారని, బడా వ్యాపారవేత్తలు, నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించుకున్నారని విపక్ష నేతలు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, దీని వల్ల ఏదో లబ్ది జరగడం వల్లే ఇలా చేస్తున్నట్టుంది అని కోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామని కోర్టు పేర్కొందని తెలుస్తోంది. ఏది ఏమైనా నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, ఏప్రిల్ 19న ఈ కేసులో పూర్తి వాదనలు వింటామని, అదే రోజున నిర్ణయం ఉంటుందని కోర్టు వెల్లడించింది.
కాగా, గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డ కోర్టు…ఆ నియామకాలపై టీటీడీ, ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆ వ్యవహారంపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది.
ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హిందూదేవాలయాల పవిత్రతను దెబ్బతీయకుండా, అర్హులైన వారిని, ఆధ్యాత్మిక చింతన, అపారమైన భక్తిభావం ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయలని జగన్ కుట్ర చేస్తున్నారని, రాజకీయ అవసరాల కోసం టీటీడీలో అనర్హులను జగన్ చొప్పిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.