సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ, టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ దుష్ప్రచారం చేస్తుంటారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైసీపీ తరఫున యాక్టివ్ గా ఉంటూ విపక్ష పార్టీలు, విపక్ష నేతలపై విషం చిమ్మడమే పంచ్ ప్రభాకర్ నైజమని కొందరు నెటిజన్లు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కోర్టులపైనా, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ పోస్టులు పెట్టడంపై విమర్శలు వచ్చాయి.
కోర్టు తీర్పులనే తప్పుబడుతూ జడ్జిలపై కామెంట్లు చేయడంపై పలువురు న్యాయనిపుణులు కూడా మండిపడ్డారు. ఈ క్రమంలోనే జడ్జిలపై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్ పై సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే, పంచ్ ప్రభాకర్ విదేశాల్లో ఉండడం వల్ల కేసు విచారణలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన పంచ్ ప్రభాకర్ కేసుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో సీబీఐ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న ప్రభాకర్ ను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని హైకోర్టు నిలదీసింది. అయితే, తాము ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా సీబీఐ పట్టించుకోలేదని స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ విన్నవించారు. అంతేకాదు, పంచ్ ప్రభాకర్ కు ఇప్పటిదాకా ఒక్క నోటీసు కూడా సీబీఐ అధికారులు ఇవ్వలేక పోయారని వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులివ్వాలని, ప్రభాకర్ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు.
ఈ క్రమంలోనే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అంతేకాదు, శుక్రవారం నాడు హైకోర్టుకు సీబీఐ ఎస్పీ రావాలని, ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకున్నది చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో, పంచ్ ప్రభాకర్ కు పంచ్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, పంచ్ ప్రభాకర్ ను త్వరలోనే ఇండియాకు తీసుకువచ్చి అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.