సీఎం జగన్ తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పాలనపై ఏమాత్రం అవగాహన లేకుండా జగన్ చట్టాలకు చేస్తున్న మార్పులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా సరే తీరు మారడం లేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం గ్రామ స్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించిన వైనంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా ఆ వ్యవహారంపై నేడు హైకోర్టు విచారణ జరిపింది. గ్రామస్థాయిలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులు తీసివేయడం హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం వార్డులకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. ఈ క్రమంలోనే ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్ట్రార్ స్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్టర్ స్థాయి వ్యక్తి విధులు ఎలా నిర్వహిస్తారని కోర్టు నిలదీసింది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించిన అధికారాలు కొనసాగుతున్నాయా లేవా అన్న విషయం కోర్టుకు తెలియజేయాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో తాజాగా జగన్ కు మరొకసారి హైకోర్టులో షాక్ తగిలినట్లయింది.