కెనడాలోని ప్రవాస భారతీయులందరు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ దేశంలో భారత్ కేంద్రంగా విద్వేష కార్యకలాపాలు, రాజకీయాలు పెరిగిపోవటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఇంతకీ కేంద్రం ఆందోళనకు ప్రధాన కారణం ఏమిటంటే ఈమధ్యనే పంజాబ్ ను ఖలిస్థాన్ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ తో ఏకంగా రెఫరెండమే జరిగింది. కెనడాలో సిఖ్ఖులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వివిధ రంగాల్లో అత్యంత బలవంతులుగా చెలామణవుతున్నారు.
ఖలిస్థాన్ దేశంగా ప్రకటించాలనే డిమాండుతో రెఫరండం నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే దీనికంటే ముందే వివిధ దేవాలయాల్లో అనేక ప్రార్థనా మందిరాల్లో విద్వేషపూరిత సమావేశాలు, కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్రం కెనడాలోని ప్రవాస భారతీయులకు గుర్తుచేసింది. ఈ నేపధ్యంలోనే రెగ్యులర్ గా గొడవలు జరుగుతూ కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘటనలు కూడా జరిగినట్లు చెప్పింది.
కేంద్రం మీద కోపంతో సంఘ విద్రోహ శక్తులు కెనడాలోని ఎవరిపైనైనా దాడులకు తెగబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకనే ఎవరికి వారుగా అప్రమత్తంగా ఉండాల్సిందే అని హెచ్చరించింది. అవసరమైతే స్ధానికంగా పోలీసులకు వెంటనే ఫిర్యాదులు చేయాలని కూడా సూచించింది. కెనడాలో విద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నాయని విదేశాంగ శాఖ ఫిర్యాదు చేసినా కెనడా ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఖలిస్ధానీ వేర్పాటువాదులు ఈ మధ్యనే టోరంటోలోని స్వామి నారాయణ్ మందిర్, విష్ణుమందిర్ పై చేసిన దాడిని గుర్తుచేసింది.
పై రెండు ప్రార్ధనా మందిరాల గోడలపైన వేర్పాటువాదులు భారత వ్యతరేక నినాదాలు రాయటమే కాకుండా దాడులు కూడా చేసిన విషయాన్ని ఆ దేశంలోని ఎంపీ చంద్ర మౌర్య ఆందోళన వ్యక్తంచేశారు. కెనడాలోని హిందు దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలపైన దాడులు పెరుగుతున్నట్లు మౌర్య ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని తాను కూడా కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆందోళన వ్యక్తంచేశారు. మొత్తానికి విదేశంలోని ప్రవాస భారతీయుల భద్రతపై కేంద్రం ఆందోళన పెరిగిపోతోంది.