ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఎంత కష్టతరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి, నాగార్జున వంటి వారికి హీరోయిన్లను వెతకడం అంటే దర్శకనిర్మాతలకు కత్తి మీద సాముగా మారింది. దీనినే ఇప్పుడు శ్రుతిహాసన్ క్యాష్ చేసుకుంటోంది. `శ్రీమంతుడు` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. `క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మళ్లీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఈమె చేసిన `వకీల్ సాబ్` సినిమా సైతం మంచి విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ నయా స్ట్రేటజీతో సీనియర్ స్టార్ హీరోలనే టార్గెట్ చేసింది. హీరోయిన్లు దొరక్క సతమతం అవుతున్న హీరోల కోసం నేనున్నా అంటూ ముందుకు వస్తోంది. అదే సమయంలో భారీ రెమ్యునరేషన్‌ను కూడా డిమాండ్ చేస్తూ కోట్లు వెనకేస్తోందట. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎన్బీకే 107`లో నటసింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది.
పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే శ్రుతి మరో సీనియర్ హీరోకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఆయనెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న చిరంజీవి తన 154వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో ప్రకటించిన సంగతి తెలిసిందే.
`మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకొనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతిహాసన్ కన్ఫార్మ్ అయింది. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే శ్రుతి హాసన్‌కు చిరంజీవి బొకే ఇస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు.