క్వీన్ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతోన్న కంగనా…తలైవితో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే, సినిమాలతో పాటు మరికొన్ని వివాదాలలో కూడా కంగనా పేరు వినిపిస్తుంటోంది. సుశాంత్ సూసైడ్ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే.
ఇక, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించి వివాదాలకు కేంద్ర బిందువవడం కంగనాకు అలవాటు. గతంలో, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై ఇన్ డైరెక్ట్ గా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది కంగనా. హృతిక్ తనతో డేటింగ్ చేశాడని, ఆ తర్వాత తనతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నాడని షాకింగ్ కామెంట్లు చేసింది కంగనా. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి కంగనా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ఇటీవల కంగనా అందుకుంది. ఆ తర్వాత ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కంగనా తన ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయింది. తాను పెళ్లి చేసుకొని, పిల్లలని కనాలని అనుకుంటున్నానని, మరో ఐదేళ్లలో తనను ఒకరి భార్యగా, తల్లిగా చూస్తారని చెప్పిందీ ఫైర్ బ్రాండ్. అంతేకాదు, తన జీవితంలో ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని బాంబు పేల్చింది కంగనా.
అయితే, అతడి పేరుని మాత్రం కంగనా వెల్లడించలేదు. కానీ, త్వరలోనే అందరికీ ఆ పేరు తెలుస్తుందని హింట్ ఇచ్చింది. ఆ వ్యక్తి తన జీవితంలోకి రావడం తన లక్ అని కంగనా ప్రౌడ్ గా ఫీల్ అయింది. మరి, కంగనా కలల రాకుమారుడెవరో తెలియాలంటే మరి కొంతకాలం వేచిచూడక తప్పదు. కాగా, సర్వేష్ మేవారా దర్శకత్వంలో రోనీ స్క్రూవావాలా నిర్మించిన ‘తేజస్’ లో కంగనా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రెడీ అవుతోంది.