కోలీవుడ్ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వివరణ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న విశాల్ టాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు నడిగర్ సంఘం ఎన్నికలలో కూడా విశాల్ యాక్టివ్ గా పాల్గొన్నారు. సినీ, రాజకీయరంగాలలో విశాల్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలోని అన్నా నగర్ లో ఉన్న విశాల్ ఇంటిపై దాడి జరిగిన ఘటన కోలీవుడ్లో కలకలం రేపింది.
కొందరు గుర్తు తెలియని దుండగులు విశాల్ నివాసంపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడి ఘటనలో విశాల్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎర్ర కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారంతా అక్కడ నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి ఆ దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి సమయంలో విశాల్ ఇంట్లో లేరని తెలుస్తోంది.
అన్నా నగర్ లో ఉన్న ఈ ఇంట్లోనే తన తల్లిదండ్రులతో పాటు విశాల్ చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. దాడి జరిగిన సమయంలో అవుట్ డోర్ షూటింగ్లో ఉన్న విశాల్ కు ఆయన మేనేజర్ ఈ దాడి గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విశాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ అయిన విశాల్ కు ఇండస్ట్రీలోనూ, బయట చాలా మంది శత్రువులే ఉన్నారు.
స్వతహాగా తెలుగువాడైన విశాల్…కోలీవుడ్ ఎన్నికల్లో అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇక, లైకా నిర్మాణ సంస్థతో ఆయనకు వివాదం నడుస్తోంది. విశాల్ తమకు డబ్బులు ఇవ్వాలంటూ లైకా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే. విశాల్ పై దాడి చేసింది ఎవరు అన్నది తేలాల్సి ఉంది.