ఏడాది నుంచి టాలీవుడ్లో రీ రిలీజ్‌ల హడావుడి నడుస్తోంది. స్టార్ హీరో ల కెరీర్లలో మైలురాళ్లలా నిలిచిపోయిన చిత్రాలకు స్పెషల్ షోలు వేస్తూ అభిమానుల చేస్తున్న హంగామా మామూలుగా ఉండట్లేదు. ఈ విషయంలోనూ రికార్డుల పోటీ మొదలై అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు, థియేటర్ సంబరాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
స్టార్ హీరోల ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ వీటి మీద ఆసక్తి కలుగుతోంది. సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ లాంటి పాత తమిళ అనువాద చిత్రాలను రీ రిలీజ్ చేస్తే వాటి కోసం కూడా జనం ఎగబడటం ఆశ్చర్యం కలిగించింది. ‘రఘువరన్ బీటెక్’తో పాటు ‘యోగి’ సినిమాను ఈ వీకెండ్లో రిలీజ్ చేయగా.. వాటికి ఉన్న రెస్పాన్స్.. కొత్త సినిమాలకు లేకపోయింది. ఇది ఆయా చిత్ర బృందాలకు బాధ కలిగించే ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ హీరో సయ్యద్ సోహెల్ రీ రిలీజ్‌ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. చిన్న సినిమాలకు రీ రిలీజ్ వల్ల ఇబ్బంది తలెత్తుతోందని అతను అభిప్రాయపడ్డాడు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి చిన్న, ప్రయోగాత్మక చిత్రాలు జనాల్లోకి వెళ్లడానికి.. టాక్ స్ప్రెడ్ కావడానికి టైం పడుతుందని.. వాటికి పోటీగా స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తే జనాల దృష్టి వాటి మీదే ఉంటుందని అతనన్నాడు.
ఈ హంగామాలో చిన్న సినిమాలు కొట్టుకుపోతాయన్నట్లు అతను మాట్లాడాడు. ఐతే రీ రిలీజ్లు ఆపేయాలని సోహెల్ అనలేదు కానీ.. ఒక ప్రత్యామ్నాయం సూచించాడు. ఈ చిత్రాలను వీక్ డేస్‌లో రిలీజ్ చేయాలని కోరాడు. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజైనా ఇబ్బంది ఉండదు కాబట్టి వీకెండ్స్‌లోనే రిలీజ్ చేయాలని లేదని.. అలా చేస్తే చిన్న సినిమాల మీద ప్రతికూల ప్రభావం పడదని.. ఎన్నో కష్టాలకు ఓర్చి చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు మేలు జరుగుతుందని సోహెల్ అభిప్రాయపడ్డాడు.