మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇరు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు సుపరిచితుడే. మంచి మాటకారి, చమత్కారి అయిన ఉండవల్లి సందర్భానుసారంగా తన మాటలు గారడీతో ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తుంటారన్న టాక్ ఉంది. అయితే, గతంలో చంద్రబాబు పాలనపై పదునైన విమర్శలతో విరుచుకుపడిన ఉండవల్లి జగన్ పాలనమై మాత్రం ఏదో నామమాత్రపు విమర్శలు చేసి సైలెంట్ గా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు, జగన్ కు ఉండవల్లి పరోక్ష మద్దతు ఉందని, వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి తన స్వామి భక్తిని చాటుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిపై సినీ నటుడు శివాజీ విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో మద్యం అమ్మకాలపై, వాటి ధరలపై ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారని, కానీ, జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నప్పటికీ, మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ ఉండవల్లి ఎందుకు సైలెంట్ గా ఉన్నారని శివాజీ ప్రశ్నించారు
అంతేకాదు, జగన్ కు ఉండవల్లి భజన చేస్తున్నారని శివాజీ దుయ్యబట్టారు. ఇక, జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని శివాజీ పిలుపునిచ్చారు. ప్రజలు పోరాటాలకు సిద్ధపడినప్పుడే అవినీతి రహిత రాజకీయాలు, నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నేతలు వస్తారని అన్నారు. వారంతా అప్పులు లేకుండా అభివృద్ధి పథంలో పాలన సాగిస్తారని శివాజీ అభిప్రాయపడ్డారు.
ఇక, జనసేనాని పవన్ కళ్యాణ్ పై కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివాజీ సూచించారు. మాజీ ఐఏఎస్ అధికారులను కాకుండా పార్టీ నేతలను, కార్యకర్తలను పవన్ నమ్ముకుంటే మంచిదంటూ హితవు పలికారు. ఇక, రాబోయే ఎన్నికల్లో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మరీ ప్రజలు ఓట్లు వేయాలని శివాజీ పిలుపునిచ్చారు. ఏది ఏమైనా చాలాకాలంగా మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న శివాజీ తాజాగా ఉండవల్లి పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.