`ఆపరేషన్ గరుడ`…2018లో ఈ పేరు ఏపీలో మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో శివాజీ మొదటి సారిగా ఈ పేరును తెరపైకి తెచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో టీడీపీ సర్కార్ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆంధ్రా ప్రజలపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే ఆ మిషన్ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, నాటి ప్రతిపక్ష నేత జగన్ పై `హాని`లేని హత్యాయత్నం జరగబోతోందని కూడా శివాజీ ముందే చెప్పారు. శివాజీ చెప్పినట్లుగానే…జగన్ పై కోడికత్తి దాడి జరిగి…ఆ సానుభూతితో జగన్ సీఎం అయ్యారు.
శివాజీ చెప్పినట్లుగానే గతంలో `ఆపరేషన్ గరుడ` పేరుతో టీడీపీ నేతలపై ఐటీ సోదాలు కూడా జరిగాయి. ఏపీలో అలజడులు రేపి టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే ఓ జాతీయ పార్టీ లక్ష్యమని బీజేపీనుద్దేశించి శివాజీ గతంలో చెప్పిన వ్యాఖ్యలన్నీ అక్షర సత్యాలయ్యాయి. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని, అమరావతికి వైసీపీ నేతలు అన్యాయం చేస్తున్నారని శివాజీ గతంలో చాలాసార్లు వాపోయారు. ఈ క్రమంలోనే చాలాకాలం తర్వాత శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
9 మంది వైసీపీ ఎంపీలు, 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్లో ఉన్నారంటూ శివాజీ బాంబు పేల్చారు. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేేశారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని శివాజీ ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు. అమరావతి ఒక కులానికి చెందినదని, టీడీపీ నేతలను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన నేపథ్యంలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. శివాజీ గతంలో చెప్పిన విషయాలు…దాదాపుగా జరిగిన నేపథ్యంలో జగన్ కు ఆ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఝలక్ ఇస్తారేమో వేచి చూడాలి.