సంగీత్ శోభన్.. మొన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘మ్యాడ్’లో ముగ్గురు హీరో లలో ఇతనొకడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ కూడా ఒక హీరోగా నటించాడు. ఐతే అలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న కుర్రాడి కంటే.. సంగీతే సినిమాలో బాగా హైలైట్ అయ్యాడు.
సినిమాలో పేరుకు ముగ్గురు హీరోలు కానీ.. పాత్రల పరంగా, నటన పరంగా డామినేట్ చేసింది మాత్రం సంగీత్ శోభనే. తన పేరు వెనుక ‘శోభన్’ అని చూస్తే అతనెవరో అర్థమైపోతుంది. దివంగత దర్శకుడు శోభన్ రెండో కొడుకు ఇతను. పెద్ద కొడుకు సంతోష్ శోభన్ ఇప్పటికే హీరోగా చాలా సినిమాలు చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. కానీ సరైన సక్సెస్ లేక అతను హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఐతే సంగీత్ మాత్రం సహాయ పాత్రలు చేస్తూనే మంచి గుర్తింపు, సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
శోభన్ కొడుకుగా, సంతోష్ తమ్ముడిగా కాకుండా తన సొంత టాలెంట్‌తోనే సంగీత్ గుర్తింపు సంపాదించాడు. ‘బేకర్ అండ్ బ్యూటీ’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ లాంటి వెబ్ సిరీస్‌లతోనే సంగీత్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. ఐతే అవి వెబ్ సిరీస్‌లు కావడంతో రీచ్ తక్కువే. కానీ ‘మ్యాడ్’ మూవీతో అతను ఒక్కసారిగా యూత్ హృదయాల్లోకి దూసుకెళ్లిపోయాడు. నేచురల్ పెర్ఫామెన్స్‌తో అతను సగటు కాలేజీ కుర్రాడిలా కనిపించాడు.
ఎక్కడా కొంచెం కూడా అతి లేకుండా పాత్రకు తగ్గట్లు కొలిచినట్లు నటిస్తూ మెప్పించిన సంగీత్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాతో అతను ఫుల్ బిజీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అతను తన అన్నయ్య సంతోష్ నటుడిగా పరిచయం అయిన ‘గోల్కొండ హైస్కూల్’లోనే ఒక పాత్ర చేశాడు.అందులో అతను బొద్దబ్బాయిగా కనిపించాడు. తన లుక్, పెర్ఫామెన్స్ క్యూట్‌గా అనిపిస్తాయి. అప్పుడు బొద్దుగా ఉన్న సంతోష్.. తర్వాత స్లిమ్ అయి ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాడు. రెండు ఫోటోలు చూసిన వాళ్లు ఇద్దరూ ఒకరేనా అని ఆశ్చర్యపోతున్నారు.