మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. కడప దర్గాకు వేరే ప్రాంతాల నుంచి ఫిలిం, పొలిటికల్ సెలబ్రెటీలు రావడం కొత్తేమీ కాదు. రామ్ చరణ్ సైతం ‘మగధీర’ రిలీజ్ టైంలో అక్కడికి వెళ్లాడు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పైగా చరణ్ అయ్యప్ప మాలలో ఉండగా అక్కడికి వెళ్లాడు.
మతం విషయంలో రాజకీయాలు చాలా సున్నితంగా మారిన ఈ పరిస్థితుల్లో చరణ్ ఇలా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్‌ను మెగా అభిమానులే తప్పుబడుతుండడం గమనించవచ్చు. అందుక్కారణం.. జనసేన పార్టీ విధానమే. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య హిందువుల హక్కులు, మనోభావాల గురించి తరచుగా ప్రస్తావిస్తున్నాడు. సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు.
ఇలాంటి సమయంలో చరణ్ అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్లడం పవన్ అభిమానులకు రుచించడం లేదు.
చరణ్‌లో ఉన్న స్ఫూర్తి అవతలి వర్గంలో ఉంటుందా.. వాళ్లు మన ఆలయాలకు వస్తారా.. రెహమాన్ మాట కోసం కడప దర్గాకు వెళ్లిన చరణ్, ఆయన్ని తిరుమలకు తీసుకురాగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందూ ధర్మం కోసం ఓవైపు పోరాటం చేస్తుంటే.. చరణ్ ఇలా చేయడం ద్వారా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి కల్పించాడనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చరణ్ మీద విమర్శల నేపథ్యంలో ఉపాసన ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టింది.
నమ్మకం మనల్ని కలిపి ఉంచుతుందని.. విడగొట్టదని.. మనం దైవత్వం దిశగా అన్ని మార్గాలనూ నమ్ముతామని.. కలిసి ఉండడంలోనే మన బలం ఉందని చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే మిగతా మతాలను గౌరవిస్తాడని ఆ పోస్టులో పేర్కొంది. ఉపాసన చరణ్‌ను ఎంతగా సమర్థించినప్పటికీ.. మత పరమైన విషయాల్లో పరిస్థితులు చాలా సున్నితంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చరణ్ ఆచితూచి వ్యవహరించి ఉండాల్సిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.