టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ వరుస ఫ్లాపుల్లో మునిగిపోతున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` వంటి సూపర్ హిట్ అనంతరం రామ్ నుండి వచ్చిన `రెడ్` ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొన్నీమధ్య `ది వారియర్`తో పలకరించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ ద్విభాష చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఇప్పుడు రామ్ ఆశలన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నాడు. `ది వారియర్` రిలీజ్ కు ముందే రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన తదుపరి చిత్రం ఉండబోతోందని అనౌన్స్ చేశాడు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రామ్ కి 20వ ప్రాజెక్ట్ కావడంతో.. `RAPO 20` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. వచ్చే ఏడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. రాబరీ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ ఉండబోతోందట. అలాగే ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఆయన పోషించబోయే రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా, ఎన్నో వేరియేషన్స్ కలిగి ఉంటాయని అంటున్నారు.
అంతేకాదు, ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి ఒక హీరోయిన్, టాలీవుడ్ నుండి ఒక హీరోయిన్ ను తీసుకోబోతున్నారట. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేసిన బోయపాటి.. ప్రస్తుతం హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ న్యూ అప్డేట్స్.. సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
కాగా, `వినయ విధేయ రామ` వంటి ఫ్లాప్ తో బాగా డీలా పడిన బోయపాటి శ్రీను.. ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణతో `అఖండ`ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి హిట్ మూవీ అనంతరం బోయపాటి.. రామ్ తో సినిమాను ప్రకటించడంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై ప్రాధాన్యత సంతరించుకుంది.