విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ దివంగత మహానేత ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. శక పురుషుడి శత జయంతి వేడుకలు పేరుతో టీడీపీ ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అన్నగారి శతజయంతి ఉత్సవాలపై ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏప్రిల్ 28న విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయని వెల్లడించారు.
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారని అన్నారు.ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తెలుగు మాట్లాడే వారి ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ కొలువై ఉన్నారన్నారు. ప్రపంచ పటంపై తెలుగు సంతకం చేసిన మహా మనిషి ఎన్టీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న ఆయనకు వందనాలని అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తరువాతనే వెండితెర వైభవం మొదలైందని, నటుడిగా, దర్శక నిర్మాతగా తెలుగు సినిమాలను ప్రభావితం చేశారని అన్నారు. అంతేకాదు, సమర్ధుడైన రాజకీయనాయకుడిగా కూడా రాజకీయాలను ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా అని, విజయవాడ ఆయన నడయాడిన ప్రాంతం అని బాలకృష్ణ అన్నారు. అన్నగారి విద్యాభ్యాసం, నాటక అనుభవం , నటుడిగా ఆయన ఎదుగుదల అన్నింటికీ విజయవాడ వేదికగా నిలిచిందని బాలయ్య చెప్పారు. అందుకే విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ జనార్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుందని బాలకృష్ణ చెప్పారు.
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని బాలయ్య అన్నారు. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడితో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు అభిమానులు జయప్రదం చేయాలని ఆయన కోరారు.