ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బాహుబలితో టాలీవుడ్ సినిమాలలో మొదలైన ఈ ట్రెండ్ ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 వరకు కొనసాగుతూనే ఉంది. అందుకే, టాలీవుడ్ హీరోలలో చాలామంది పాన్ ఇండియా మూవీ చేయాలని తహతహలాడుతున్నారు. అటువంటి కథ, నిర్మాత, దర్శకుడు దొరికితే రెండు మూడేళ్లు కష్టపడైనా పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించాలని చూస్తున్నారు.
ఇటువంటి తరుణంలో టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదంటూ నాని చేసిన కామెంట్లు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నాని అప్ కమింగ్ మూవీ ‘అంటే సుందరానికీ’ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” మీ నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నాని ఆ సమాధానమివ్వడంతో అంతా షాకయ్యారు.
దేశమంతా సినిమాకు మంచి పేరొస్తే .. ఎక్కడెక్కడో వున్న వాళ్లంతా మన తెలుగు సినిమాని చూసి.. ఫోన్ చేసి చాలా బాగుందని ప్రశంసిస్తున్నారని, అది పాన్ ఇండియా కిందే లెక్క అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు నాని. తెలుగు, తమిళ్, మళయాళంలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారుని, కన్నడలో ఎందుకు రిలీజ్ చేయడం లేదని నానికి ప్రశ్న ఎదురైంది. సాధారణంగా దక్షిణాదిలోని మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పి తెలుగు సినిమాలు విడుదల చేస్తామని అన్నారు.
కానీ, కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను అర్ధం చేసుకుంటారు కాబట్టి వారి కోసం డబ్బింగ్ చేసి విడుదల చేయడం లేదని అన్నాడు. తెలుగుతో కన్నడ పోలి ఉంటుంది కాబట్టి ఒరిజినల్ వాయిస్ తో వారే అర్ధం చేసుకుంటారని, అందుకే కన్నడలో రిలీజ్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు నాని. ఇక, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.