నేచురల్ స్టార్ నాని తో సినిమా అంటే నిర్మాతలు గుండె మీద చేయి వేసుకుని ఉండొచ్చనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అతను తన పాత్రలను ఎలా పండిస్తాడో, సినిమాను ఎలా తన భుజాల మీద నడిపిస్తాడో తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ ముంగిట ప్రత్యేక శ్రద్ధతో ప్రమోషన్లు చేసి ఒంటి చేత్తో దాన్ని జనాల్లోకి తీసుకెళ్తాడు. నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘దసరా’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయిందంటే అందులో నాని పాత్ర అత్యంత కీలకం.
ప్రమోషన్ల ద్వారా ఆ సినిమాను గట్టిగా పుష్ చేశాడు నాని. ఇక తన కొత్త చిత్రం ‘హాయ్ నాన్న’కు కూడా అలాగే పుష్ ఇస్తున్నాడు నేచురల్ స్టార్. ఇది ‘దసరా’ లాగా మాస్ మూవీ కాదు. థియేటర్లకు ప్రేక్షకులను ఆ స్థాయిలో పుల్ చేయడం కష్టం. క్లాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నప్పటికీ.. మిగతా వర్గాలను థియేటర్లను రప్పించడానికి నాని తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు.
ఇప్పుడంతా జనాల మూడ్ ఎన్నికల మీదే ఉండగా.. అందుకు తగ్గట్లే సినిమా ప్రమోషన్లను కూడా ప్లాన్ చేసుకున్నాడు నాని. మొన్న రాజకీయ నాయకుడి అవతారంలోకి మారి ఎన్నికల మేనిఫెస్టో లాగే తమ సినిమాలో ఏమేం ఆకర్షణలు ఉంటాయో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ ప్రమోషనల్ ఈవెంట్లో నారా లోకేష్‌ను అనుకరించాడు.
లేటెస్ట్గా నాని.. కేసీఆర్ మీద ఫోకస్ చేశాడు. ఆయన స్టయిల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్ ప్రోమో వదిలాడు. కేసీఆర్‌ను గమ్మత్తుగా ఇమిటేట్ చేస్తూ.. ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి ఫిదా అవ్వని వాళ్లుండరు. సినిమా కాన్సెప్ట్‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి, దాని మీద ఆసక్తి పెంచడానికి నాని ఎంచుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీపై ప్రశంసలు కురుస్తున్నాయి.