ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారానికి ఎట్టకేలకు జగన్ అండ్ కో పుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ కొత్త జీవోను ఏపీ ప్రభుత్వం జారీచేయడంపై పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజా తదితరులు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన జక్కన్న…కొత్త జీవోలో సవరించిన టికెట్ ధరల ద్వారా జగన్ గారు, పేర్ని నానిగారు చలన చిత్ర రంగానికి ఎంతగానో సహాయపడ్డారని అన్నారు. ఇది సినిమాల పునరుద్ధరణకు దోహదపడుతుందని ఆశిస్తున్నానంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో కొత్త రేట్లు కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అనుకుంటున్నారు.
మరోవైపు, కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్లపై మహేశ్ బాబు స్పందించారు. తమ సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు సీఎం జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, తెలుగు చలన చిత్ర పరిశ్రమల మధ్య బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. టికెట్ రేట్ల జీవో నేపథ్యంలో మంత్రి పేర్ని నానికి కూడా మహేశ్ ధన్యావాదాలు తెలుపుతూ ట్వీట్ చేశఆరు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ లు జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలోనే టికెట్ రేట్ల పెంపుపై సానుకూల స్పందన వచ్చిందని వారు వెల్లడించగా…అదే విషయాన్ని ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా జీవో రూపంలో విడుదల చేసింది. అయితే, కొత్త జీవోపై మహేశ్ స్పందన లేటయ్యిందేంటి ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, షూటింగులో మహేశ్ బిజీగా ఉన్నాడని ..అందుకే లేటుగా స్పందించాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.