ఒక సినీ నటుడికి అభిమానులు సర్వసాధారణం. కానీ.. అభిమాని అంటే అభిమాని అన్నట్లుగా.. అమితంగా ఆరాధించటం.. ఆయన్ను మాత్రమే ఆరాధించటం లాంటివి చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. అలాంటి కరుడుగట్టిన అభిమానుల్ని సొంతం చేసుకున్న సినీ నటుడు తెలుగులో ఎవరైనా ఉన్నారా? అంటే అది సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే. తెలుగు సినిమా కీర్తి కిరీటాన్ని ఎగురవేసి.. కోట్లాది మంది తెలుగు ప్రజల్ని సమ్మోహనం చేసిన హీరోలు తెలుగు తెరకు కొత్తేం కాదు. కానీ.. వీరందరికి సాధ్యం కానిది సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది మాత్రం ఆయన హార్డ్ కోర్ అభిమానులని కూడా చెప్పొచ్చు.
దీనికి కారణం లేకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సూపర్ హీరోలుగా తొలితరం హీరోలు ఎన్టీఆర్.. ఏఎన్నార్. వీరిద్దరికి కోట్లాది మంది అభిమానులు ఉండేవారు. కానీ.. అప్పటి సామాజిక.. ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు.. రైతువారీ విధానం ఎక్కువగా ఉండటం.. మరే రంగానికి పెద్ద ప్రాధాన్యత లేని నేపథ్యంలో.. అప్పటి అభిమానం పరిమితంగా కనిపించేది.
అరవైల మధ్యలో ఎంట్రీ ఇచ్చి.. డెబ్భై దశకానికి ముందు నుంచి సూపర్ హీరోగా తయారైన సూపర్ స్టార్ కృష్ణకు లాభించిన అంశం ఏమంటే.. తర్వాతి జనరేషన్ కు కొత్త ఆరాధ్యనీయుడైన హీరోగా మారారు. అప్పటికే ఎన్టీఆర్.. ఏఎన్నార్ వయసులో కాస్తంత పెద్దవారు కావటం.. తమకు.. తమ ఆలోచనలకు తగ్గ తమ తరం హీరోగా కృష్ణ వారి మనసుల్ని దోచుకున్నారు.
కృష్ణ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వచ్చే వరకు ఆయన మాత్రమే కనిపించేవారు. చిరంజీవి మొదటి సినిమా 1978లో పునాది రాళ్లు. చిన్న వేషాలతో మొదలుపెట్టి.. తనను తాను నిరూపించుకునేసరికి చిరంజీవికి కాస్తంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తెలుగు సినిమాకు సంబంధించి అప్పటి తరాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన హీరోగా కృష్ణ నిలిచారు.
తెలుగు ప్రజలకు సినిమాకు మధ్యనున్న అనుబంధం గురించి తెలిసిందే. వారి జీవితాల్లో దానికిచ్చే ప్రాధాన్యత ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రియురాలిని కానీ తాను పెళ్లాడే అమ్మాయిని కానీ.. పెళ్లి తర్వాత వారి స్వీట్ మెమరీలో మొదటి వరుసలో ఉండేది కలిసి సినిమా చూడటం. సినిమాకు తెలుగు ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. అంతటి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలకు.. తాము అభిమానించే నటీనటులకు ఎంతటి ప్రయారిటీ ఇస్తారో తెలిసిందే.
డెబ్భైల నాటికి చిన్న పిల్లలుగా ఉన్న వారు మొదలు.. అరవైల చివర్లో పుట్టిన వారిలో అత్యధికులు కృష్ణకు అభిమానులు. ఆయన్ను అభిమానించటం మొదలు పెట్టిన తర్వాత వేరే హీరోను అభిమానించటం తప్పుగా ఫీలయ్యే అభిమానులుగా కృష్ణ ఫ్యాన్స్ ను చెప్పుకోవాలి. ఎందుకిలా? అన్న దానికి సమాధానం చెప్పలేరు కానీ.. తాము మాత్రం కృష్ణను మాత్రమే అభిమానిస్తామని చెబుతుంటారు. అలా అని వేరే హీరో సినిమాలు చూడరని కాదు. తమ అభిమాన నటుడిగా ఆయనకు మాత్రమే ఓటు వేయటం సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే చెల్లుతుంది.
కృష్ణ తర్వాత చాలామంది హీరోలు వచ్చినా.. ఆయనకు మాత్రమే సాధ్యమైన అంశం ఏమంటే.. తెలుగు సినిమాకు సంబంధించి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదలుకావటం కృష్ణతోనే మొదలైంది. ఇవాల్టికి కూడా కృష్ణను అభిమానించే చాలామంది ఆయన అభిమానులు ఇప్పటికి తమ ఆరాధ్య నటుడు కృష్ణ అని మాత్రమే చెబుతారు. మహేశ్ బాబు అని కొంటెగా ప్రశ్నిస్తే.. కృష్ణ తర్వాత మాత్రమే అని చెప్పే అసలుసిసలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ క్రిష్ణ మాత్రమే. గమనిక.. ఈ వ్యాసం ఏ అభిమానిని హర్ట్ చేయటానికో.. మరే హీరోను చిన్నబుచ్చటానికో కాదు. నిజంగా.. నిజాయితీగా.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానుల్ని చాలా దగ్గర నుంచి గమనించి.. పలువురు సినీ ప్రముఖులతో మాట్లాడిన తర్వాత మాత్రమే రాసినది.