తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వారితో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్సంబంధాలు నెరుపుతారన్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లతో బాలయ్య పలుమార్లు భేటీ అయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన పలు కార్యక్రమాలకు సంబంధించి వారితో చర్చించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ వెళ్లారు.
రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన బాలయ్య కాసేపు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాజకీయాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. బాలయ్యతోపాటు రేవంత్ రెడ్డి నివాసానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే గత ఏడాది డిసెంబరులో కూడా రేవంత్ రెడ్డిని బాలయ్య కలిసి ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు.