టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్సేన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విలక్షణమైన పాత్రలతో కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విశ్వక్సేన్ తన ప్రవర్తనతో కూడా అంతే పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా గతంలో కొన్ని ఈవెంట్స్ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడిన తీరు అతడి యాటిట్యూడ్ చాలామందికి నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ హీరో అర్జున్ తో కూడా విశ్వక్సేన్ వివాదం నడుస్తోంది. ఆ వివాదం చినికిచినికి గాలి వానగా మారింది.
అర్జున్ కూతురు ఐశ్వర్య, విశ్వక్సేన్ లు జంటగా అర్జున్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ మూడు నెలల క్రితం మొదలుకాగా ఆ తర్వాత ఆగిపోయింది. ఇక, చిత్ర యూనిట్ తో విశ్వక్సేన్ కు గొడవ జరిగిందని, అందుకే ఆయన షూటింగుకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ కు రావాలని అర్జున్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే విశ్వక్సేన్ స్పందించకపోవడంతో ఈ వివాదం ముదిరింది.
అంతేకాదు, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మొత్తం మారిస్తే గాని షూటింగ్ కు రానని విశ్వ చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వివాదంపై అర్జున్ స్పందించారు. తన 42 ఏళ్ల సినీ కెరీర్ లో ఒకరి గురించి చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. ఇకపై విశ్వక్సేన్ తో సినిమా చేసేది లేదని, అది చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు. తన కథ విశ్వక్సేన్ కు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని, ఆయన అడిగినంత రెమ్యున్ రేషన్ కూడా ఇచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నామని అర్జున్ వెల్లడించాడు.
అయితే, షూటింగ్ లో విశ్వక్సేన్ ప్రవర్తన వల్ల తమ చిత్ర బృందం బాగా ఇబ్బంది పడిందని అర్జున్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ వ్యవహారంపై విశ్వతో మాట్లాడేందుకు ఫోన్ చేయగా ఆయన వైపు నుంచి స్పందన లేదని చెప్పారు. తన జీవితంలో విశ్వక్సేన్ కు చేసినన్ని ఫోన్లు ఎవరికీ చేయలేదని అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నటుడు చాలా అన్ ప్రొఫెషనల్ అని, ఈ వ్యవహారంపై, అతడి తీరుపై ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేయబోతున్నానని అర్జున్ సంచలన ప్రకటన చేశారు.