సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో 35 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరైన క్రమంలో నేడు శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు.
టీఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి కిమ్స్ ఆస్పత్రికి బన్నీ వచ్చారు. శ్రీ తేజ్ ను పరామర్శించిన బన్నీ…రేవతి భర్త భాస్కర్ తో మాట్లాడారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, భాస్కర్ ను అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు. భాస్కర్ కుటుంబానికి, శ్రీ తేజ్ కు అండగా ఉంటానని బన్నీ చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
బన్నీ రాక నేపథ్యంలో కిమ్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ రావాలంటే తమకు ముందస్తుగా చెప్పాలని పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.