మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో వింత పరిస్థితి నెలకొంది. భారీ వరదలు అక్కడి ఆడ పిల్లల జీవితాలకు శాపంగా మారాయి. పాకిస్థాన్ లో ఒకప్పుడు బాల్య వివాహాలు కామన్నే అయినా.. ఆ తర్వాత వాటి సంఖ్య బాగా తగ్గింది. కానీ గత రెండేళ్ల నుంచి బాల్య వివాహాలు మళ్లీ ఊపందుకున్నాయి. వాతావరణ పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. జులై – సెప్టెంబర్ మధ్యలో వచ్చే రుతుపవనాలు పాకిస్థాన్ దేశానికి చాలా కీలకం. లక్షలాది మంది రైతులు ఆ రుతుపవనాలపైనే ఆధారపడతారు.
అయితే ఇటీవల కాలంలో పాక్ లో వాతావరణ మార్పులు ఆందోళన కరంగా మారాయి. ముఖ్యంగా 2022లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. వరదల వల్ల మూడొంతుల భాగం జలమయమైంది. కొండచరియలు విరిగిపడటం, ఆస్తి నష్టం, పంట నష్టం అక్కడి ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీశాయి. పూట కూడా గడవని పరిస్థితికి తెచ్చిపెట్టాయి. ఈ దారుణమైన పరిణామాల నడుమ పాకిస్థాన్ లో బాల్య వివాహాలు పెరగడం స్టార్ట్ అయ్యాయి.
జూలై-సెప్టెంబరు మధ్య కురిసే భారీ వర్షాలు, సంభవించే వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట నష్టాల వల్ల చిన్నాభిన్నం అవుతున్న పాక్ ప్రజలు.. బతుకుతెరువు కోసం పురుషుల కుటుంబాల నుంచి సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బు తీసుకుని, తమ మైనర్ బాలికలతో వారికి వివాహం జరిపిస్తున్నారు. రెట్టింపు వయసువాడైనా సరే అతడికిచ్చి తమ కుమార్తెలను బలవంతంగా కట్టబెట్టేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బాలికలు కూడా వివాహాలకు అంగీకరిస్తున్నారు. దీంతో ఇప్పుడు వారిని `మాన్సూన్ బ్రైడ్స్(వర్షాకాలం వధువులు)`గా పిలుస్తున్నారని పాకిస్థాన్ లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ సంస్థ వ్యవస్థాపకుడు మషూక్ తెలిపారు. 2022లో సంభవించిన వరదలు బాల్య వివాహాలకు ఆజ్యం పోశాయి. కేవలం ఖాన్ మొహమ్మద్ మల్లా గ్రామంలోనే గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 45 బాలికలు భార్యలుగా మారారు. బతకడం కోసమే బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నామని బాలికల తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.