గురువారం నుంచి మొదలవ్వబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తతలు తప్పేట్లు లేదు. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన బిల్లును ప్రస్తుత సమావేశాల్లో అధికార పార్టీ ప్రవేశ పెట్టబోతోందని సమాచారం. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రతిపాదించబోయే బిల్లును వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యింది.
సమావేశాలు జరగబోయే ఐదు రోజుల్లో మిగిలిన అంశాలు ఎలాగున్నా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మూడు రాజధానుల అంశం మాత్రమే. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటునే ప్రధాన ఎజెండాగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ రెడీ అవుతున్నారు. రాజధాని అంశంపై రెండువైపులా ఇంతటి పరస్పర విరుద్ధమైన భావన ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు చాలా హాటుహాటుగా జరగటం ఖాయమనే అనిపిస్తోంది.
మూడు రాజధానులపై మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టి సభలో ఆమోదించుకోవాలన్నది అధికారపక్షం పట్టుదల. మెజారిటీ కారణంగా అసెంబ్లీ, శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇదే సమయంలో తగినంత బలం లేకపోయినా బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించింది కాబట్టి గొడవలు జరగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు అమరావతే ఏకైక రాజధానిగా పాదయాత్ర మొదలైన నేపధ్యంలోనే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును పెడుతున్నది.
మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు అసెంబ్లీలోనే జగన్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారట. అలాగే మూడు రాజధానులపై కీలకమైన ప్రకటన కూడా చేయబోతున్నారన్నది సమాచారం. మరి పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ఏముంటుంది ? చేయబోయే కీలకమైన ప్రకటన ఏమిటన్నది ఆసక్తిగా మారింది. డెఫినెట్ గా ఈ రెండింటిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలోనే సభలో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.