మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనూహ్యరీతిలో వార్తల్లోకి రావటం.. హాట్ టాపిక్ గా మారటం.. అంతలోనే మాయమైపోవటం లాంటివి తరచూ చోటు చేసుకుంటాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. రోటీన్ కు భిన్నంగా ఈసారి ఆమె ఆరోగ్య సమస్య కారణంగా వార్తల్లోకి వచ్చారు. తనకు ఎదురైన ఆరోగ్య సమస్యల గురించి ఆమె చెప్పిన మాటలు విన్నంతనే వణుకు పుట్టాల్సిందే.
కరోనా అనంతరం.. మధ్యవయస్కులు.. అప్పటివరకు బాగానే ఉన్నట్లు కనిపించి.. ఆ వెంటనే కుప్పకూలిపోయే ఉదంతాలు ఎంత భారీగా చోటు చేసుకుంటున్నాయో తెలిసిందే. తాజాగా సుస్మిత తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఇటీవల ఆమెకు యాంజియో ప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. నిత్యం హెల్త్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపే సుస్మితకు ఇలాంటి పరిస్థితా? అంటూ పలువురు ఆశ్చర్యపోయే పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సుస్మిత మాట్లాడుతూ.. తాను ఏడాదిలో రెండుసార్లు గుండె పరీక్షలు చేయించుకున్నప్పటికీ.. ఇటీవల తాను గుండెపోటుకు గురైనట్లుగా చెప్పారు. ‘గుండె నిర్మాణం.. పని తీరును చెక్చేసే ఎకో కార్డియోగ్రామ్ టెస్టు సైతం అంతా బాగున్నట్లుగా రిపోర్టు వచ్చింది. ఇటీవల నాకు గుండెపోటు రావటానికి ఆర్నెల్ల ముందు సైతం చేయించిన టెస్టుల్లోనూ అంతా బాగానే ఉన్నట్లు వచ్చాయి. అప్పుడు బాగున్నట్లుగా చెప్పినప్పటికి.. అకస్మాత్తుగా గుండె పోటుకు గురి కావటం తనను షాక్ కు గురి చేసింది’’ అని వెల్లడించారు.
తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉననాయని.. జన్యుపరంగా తనకు ఉంటాయన్న ఒక అవగాహన తనకు ఉందన్న ఆమె.. అందుకే.. తాను ఏడాదికి రెండుసార్లు గుండె పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాజాగా ఆమె చేసిన ఆర్య సీజన్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని చేస్తున్న వేళలోనే ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒక యాక్షన్ సీన్ లో ఆమెకు గుండెపోటు వచ్చినట్లుగా చూపిస్తారు. రీల్ లో చేసిన ఈ సీన్.. రియల్ లైఫ్ లో ఆమె నిజంగానే గుండె పోటుకు గురైన నెల తర్వాత ఈ సీన్ తీసినట్లుగా చెప్పారు. అంతా బాగున్నట్లుగా రిపోర్టులు వచ్చిన తర్వాత కూడా గుండెపోటుకు గురి కావటం షాకిస్తోంది.