సీఎం జగన్ పాలనలో గతంలో ఎన్నడూ జరగని అద్భుతాలు ఏపీలో జరుగుతున్నాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్బీకేలను పెట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆ వ్యవహారంపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయినా సరే వైసీపీ సర్కార్ తీరు మారలేదు. తాజాగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల విషయంలోనూ జగన్ తాను అనుకున్నదే చేయాలని చూస్తున్నారు. ఆఖరికి శ్మశానాలనూ వదలకుండా అక్కడ హెల్త్ క్లినిక్ లు నిర్మించేందుకు సిద్ధపడుతున్నారు.
ఏపీలో రూ.1692 కోట్ల వ్యయంతో 8585 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మించాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆఖరికి శ్మశాన వాటికలనూ వదలడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే హెల్త్ క్లినిక్ నిర్మాణానికి సమాధులను తవ్వేసి చదును చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పుట్టపర్తిలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే, ఆందోళనలకు వెళ్లకుండా టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు.
మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పుట్టపర్తి బంద్‌లో పాల్గొనేందుకు వెళుతుండగా వారిని ముందస్తు అరెస్టు చేశారు. అమరావతి నుంచి వస్తున్న ఇద్దరు నేతల వాహనాలను బుక్కరాయసముద్రంలో నిలిపివేశారు. ఈ అక్రమ అరెస్టులను పలువురు టీడీపీ నేతలు ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా పోలీసుల సాయంతో అరెస్టు చేయిస్తున్నారని మండిపడుతున్నారు.