ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ గ్రామంలో యువతిపై అత్యాచారం చేసి, ఘటనను ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక కోసేసిన అత్యంత దారుణ దురదృష్టకరమైన ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా బీజేపీ పరువును గంగలో కలిపేసింది.
యువతి ఆస్పత్రి పాలై రోజుల పాటు నరకం అనుభవించి చివరకు ప్రాణం వదలడంతో ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కిరాతక చర్యను నిరసిస్తూ దేశమే బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళిన కాంగ్రెస్ కీలక నేతలు రాహూల్ గాంధి, ప్రియాంక గాంధీలు వెళ్లగా వారిపై పోలీసులు దాడి చేసిన తీరు దేశం విస్తుపోయేలా చేసింది.
అప్పటికీ మారని యూపీ పోలీసులు గ్రామానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలపై లాఠీచార్జి జరపడం సమస్యను మరింత తీవ్రం చేసింది. విచారణ పూర్తిచేయకుండానే ఈ ఘటనపై అడిషినల్ డీజీపీ మాట్లాడుతూ యువతిపై దాడి జరిగిందే కానీ అత్యాచారం జరగలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అత్యాచారం జరగలేదని నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు. అయితే… ఏ భయంతో కుటుంబానికి మృతదేహాన్ని ఇవ్వకుండా కాల్చేశారు? అని దేశం ప్రశ్నిస్తోంది. దీంతో పోలీసులు అడ్డంగా ఇరుక్కుపోయారు.
బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అండగా నిలవలేదు. అంతేగాకుండా… వారికి జాతీయ నేతలు మద్దతు పలకడానికి, సాయం చేయడానికి వస్తే వారిని రానివ్వకపోవడం మరో విషాదకరమైన పరిణామం. గ్రామంలోకి బయటవారిని రానీయకుండా పోలీసులు మొత్తం గ్రామం చుట్టూతా బ్యారికేడ్లు పెట్టేశారు. వేలాది పోలీసులను మొహరించారు.
హథ్రస్ ఘటన ఢిల్లీ నిర్భయ ఘటనతో సమానంగా మద్దతు పొందడం విశేషం. రాజకీయ పార్టీలు మీడియా మీద కూడా యోగి సర్కారు ఆంక్షలు పెట్టింది. కొందరు రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయించిన పుణ్యమంతా గంగలో కలిసి దేశంలో అందరి చేత తిట్లుతింటున్నారు యోగి.
ప్రభుత్వ తీరు వల్ల జనానికి అనుమానాలు పెరిగాయి. అసలే మోడీపై కరోనా అనంతరం పెరిగిన వ్యతిరేకతకు ఈ ఘనట మరింత ఆజ్యం పోసింది.