పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐ రహస్యాలు తన గుప్పిట్లో ఉన్నాయని ఇటీవల ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 29న లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ శుక్రవారం నాడు ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది.
ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ వజీరాబాద్‌లో ర్యాలీ చేపట్టిన సందర్భంగా ఆయనపై హత్యా ప్రయత్నం జరిగిన వైనం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. ఓ మాజీ దేశాధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్ ను హతమార్చడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగుడు ఒక్కసారిగా ర్యాలీలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ కాలుకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన అనుచరుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్ కు ప్రాణహాని లేదని వైద్యులు చెప్పారు. ఇక, ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ దుండగుడిని హసన్ అనే వ్యక్తి సాహసం చేసి అడ్డుకున్నాడు.
ఆ క్రమంలోనే దుండగుడి చేతి నుంచి తుపాకీ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ దుండగుడిని హసన్ తో పాటు ఇమ్రాన్ అభిమానులు వెంబడించి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే హసన్ పై ఇమ్రాన్ అభిమానులతో పాటు పాక్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హసన్ ను ఇమ్రాన్ అభిమానులు ఊరేగించారు. తాను కొట్టిన తర్వాత దుండగుడి చేతిలో తుపాకీ కింద పడిపోయిందని, తాను బ్రతికున్నంత వరకు ఇమ్రాన్ కు ఏమీ కానివ్వనని హసన్ అంటున్నాడు.
ఇక, ఇమ్రాన్ పై దాడిని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై పాక్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పంజాబ్ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక కోరాలని అంతర్గత మంత్రి రాణాను ఆదేశించారు. ఇక, పాక్ ప్రధాని పదవిని కోల్పోయినప్పటి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఖాన్ ఎన్నోసార్లు వెల్లడించారు. మాజీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వంపై, పాక్ నిఘా విభాగం ఐఎస్ఐపై కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ఐఎస్ఐ పెద్దలు….ఇమ్రాన్ పై కాల్పులు జరిపించి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి.