చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ అపాయింట్ దొరకడం అంటే తిరుపతి లడ్డూ దొరికినట్టేనని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ను కలవాలంటే అదో పెద్ద ప్రహసనం అని, చాలామంది శాసన సభ్యులకు జగన్ దర్శనం కన్నా తిరుమల వెంకన్న దర్శనం సులువుగా దొరుకుతుందని టాక్. అయితే, జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటుందని, వారికి మాత్రం జగన్ తో ఎపుడు కావాలంటే అపుడు అపాయింట్ మెంట్ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక, మీడియా ముందుకు కూడా కొందరు పరిమిత వైసీపీ నేతలు మాత్రమే మాట్లాడతారని, మిగతా మంత్రులు మాట్లాడాలని ఉన్నా మాట్లాడే అవకాశం లేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మంత్రుల కన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయంపై మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత జీవీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండీ? ఓవరేక్షన్ ఎక్కువైంది…అంటూ హర్ష కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. మంత్రులంతా కొంచెం ఆత్మగౌరవంతో బతకాలని, ఎందుకు ఈ వెధవ పదవులు అంటూ హితవు పలికారు.. కనీసం మీలో ఒక్కడికి కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వడనే, సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మాట్లాడిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన వెధవ బతుకులు, పదవులు ఎందుకని… కొంచెం గౌరవం పెంచుకోండని హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వైఎస్ఆర్ హయాంలో ఆయన ముఖ్య సలహాదారు కేవీపీ రామచంద్రరావుతో సహా అందరూ వెళ్లేవారని, కేవీపీ చర్చించిన తర్వాతే వైఎస్ నిర్ణయం తీసుకునేవారని అన్నారు. కేవీపీ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలను చెప్పేవారు కాదని, కానీ, సజ్జల ఎవరండీ బాబు, ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తాడు. ప్రతిపక్షనేతలను విమర్శిస్తాడు. ప్రజల డబ్బు తింటున్నాడు అని ఫేస్ బుక్ లైవ్ లో హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ కు శిరోముండనం జరిగి 8 నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని, అతడికి న్యాయం జరిగేలా కోర్టుకు వెళ్తామని అన్నారు.