తెలుగు సినిమా దర్శకుల మీద వినిపించే విమర్శలకు.. కొందరినోటి నుంచి వచ్చే ప్రశ్నలకు హోల్ సేల్ గా సమాధానం ఇచ్చేశారు దర్శకులు హరీశ్ శంకర్. పెద్ద అంచనాలు లేకుండా మలయాళంలో విడుదలైన 2018 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ మూవీ ఏకంగా రూ.100కోట్ల కలెక్షన్ ను కొల్లగొట్టిన వైనం ఆసక్తికరంగా మారటమే కాదు.. అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఈ వారం విడుదలవుతున్న ఈ మూవీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒకరు అడిగిన ప్రశ్నకు ఈ సినిమాతో సంబంధం లేని దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. 2018 తెలుగు వెర్షన్ ను బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. 2018 సినిమా చూశాక తెలుగు దర్శకులు ఈ తరహా ప్రాజెక్టు చేయగలరా? తెలుగు నిర్మాతలు సాహసం చేస్తారా? అని మీకు అనిపించిందా? అంటూ ఒక మీడియా ప్రతినిధి (ఈ పెద్ద మనిషి కూడా డబ్బింగ్ సినిమాల్ని విడుదల చేసిన ఘన చరిత్ర ఉంది. ఒక సినిమా పత్రికను నడుపుతుంటారు)గా వ్యవహరిస్తూ ప్రశ్నించారు.
దీనికి తాను సమాధానం చెప్పే కన్నా.. ఈ ప్రోగ్రాంకు అతిధిగా హాజరైన హరీశ్ శంకర్ సమాధానం ఇస్తే బాగుంటుందన్న బన్నీ వాసు.. మైకు ఆయనకు ఇచ్చారు. విలేకరుల సమావేశంలో కొన్ని ప్రశ్నలు అడగటం.. యూట్యూబ్ లో ఫేమస్ కావటం చేస్తున్నారంటూ సదరు వ్యక్తిపై పంచ్ లతో మొదలు పెట్టిన హరీశ్ శంకర్.. ‘‘ప్రస్తుతం ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసింది. అలాంటి టెక్నాలజీలో మనమున్నాం. దీన్నిడబ్బింగ్ సినిమా అంటున్నారు. ఆర్ఆర్ఆర్.. బాహుబలిని హిందీలో ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా? డబ్బింగ్.. రీమేక్ అనేది లేదు. కేవలం సినిమా అంతే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా ఎక్కడికైనా వెళుతున్నందుకు సంతోషించాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఇలాంటి ప్రశ్న వేశారంటే జాలిగా ఉంది’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.
తాను ఈ సినిమాను చూశానని.. ఈ సినిమాకు దర్శకుడు కేరళకు చెందిన వ్యక్తి అని చూడలేదని.. అతడి పనితీరు నచ్చి తాను సినిమా చూశానని.. మీడియా ముఖంగా ఆయన్ను అభినందిద్దామని వచ్చినట్లుగా పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారన్న హరీశ్ శంకర్.. వరుసగా వంద డబ్బింగ్ సినిమాలు బన్నీ వాసుతో నేనే రిలీజ్ చేయిస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘అయినా అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించాలనుకొని చేసే ప్రయత్నాల్ని మెచ్చుకోవాలి కదా?’ అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు భాషాపరమైన వ్యత్యాసాలు లేవని.. కేవలం మంచి సినిమా మాత్రమే ఉందన్నారు. సినిమా అంటే ఒక భాష.. దానికి ప్రత్యేకంగా భాషతో సంబంధం లేదు.. అదో ఎమోషన్ గా అభివర్ణించారు. మొత్తానికి తెలుగు దర్శకుల తరఫున హరీశ్ శంకర్ భలేగా ఆన్సర్ ఇచ్చారే అన్న మాట వినిపిస్తోంది.